కడప
వైయస్ వివేకా హత్య కేసులో రోజుకో మలుపు తిరుగుతోంది. గంటకో వార్త సంచలనం రేకెత్తిస్తోంది. తాజాగా మరో ట్విస్టు తిరిగింది. సంచలనం రేపిన వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. కొత్తగా గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి తెరపైకి వచ్చాడు. వైఎస్ అవినాష్ రెడ్డి తో పాటు మరికొందరిని ఈ కేసులో ఇరికించేలా తనపై ఒత్తిడి తెస్తున్నారని అనంతపురం జిల్లా యాడికికి చెందిన గంగాధర్ రెడ్డి జిల్లా ఎస్పీ ఫక్కీరప్పకు ఫిర్యాదు చేశారు. వైయస్ వివేకా కూతురు సునీతతో పాటు మరికొందరు అనుచరులు తనను బెదిరిస్తున్నారని గంగాధర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. గతంలో కూడా సీబీఐ అధికారులు, ప్రస్తుత సిఐ శ్రీరామ్ తనను తీవ్రంగా వేధించారని గంగాధర్ రెడ్డి ఆరోపిస్తున్నారు.ఇందుకు తను ఒప్పుకోకపోవడంతో డబ్బు కూడా ఇస్తామని చెప్పారని అంటున్నారు గంగాధర్ రెడ్డి. ఇప్పుడు ఏకంగా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. తనతో పాటు కుటుంబ సభ్యులకు ప్రాణ రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.సీబీఐ, వివేకా అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసాడు. తనకు రక్షణ కల్పించాలని ఎస్పీ ని కోరాడు. 10 కోట్ల ఇస్తామని సీబీఐ ఆఫర్ చేసింది. వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్, భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి ప్రమేయం ఉందని చెప్పాలని సీబీఐ ఒత్తిళ్లు తెస్తోంది. వివేకా హత్య కేసులో తనకు సంబంధం లేదు. లేని విషయాన్ని ఉన్నట్లు చెప్పేదిలేదని గంగాధర్ రెడ్డి చెప్పాడని తెలిసింది