తిరుమల, మా ప్రతినిధి, నవంబర్ 08, తిరుమల, ఇతర ప్రాంతాల్లోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయాల్లో స్వచ్ఛందంగా భజనలు చేసేందుకు భక్తులకు అవకాశం కల్పించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని టిటిడి కార్యనిర్వహణాధికారి డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి ధార్మిక ప్రాజెక్టుల కార్యక్రమాల అధికారిని ఆదేశించారు.
టిటిడి పరిపాలనా భవనంలో సోమవారం నిర్వహించిన సీనియర్ అధికారుల సమావేశంలో ఈవో మాట్లాడుతూ తిరుమలలో స్వచ్ఛందంగా జరగాల్సిన భజన కార్యక్రమాలను పునర్ వ్యవస్థీకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. భజన కళాకారులు భజన కార్యక్రమాలు నిర్వహించేందుకు ఒక ప్రత్యేక సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ రూపొందించాలని అధికారులకు సూచించారు. తద్వారా కళాకారులు, భజనమండళ్ళకు స్వచ్ఛందంగా భజనలు చేసేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. తిరుమలలో నాదనీరాజనం వేదిక ద్వారా విరివిగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. నాదనీరాజనం కార్యక్రమాల్లో అవకాశం రానివారు సైతం ఈ భజన కార్యక్రమాలకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. టిటిడి నిధులతో ఆంధ్రప్రదేశ్‌లో 502 ఆలయాలను మారుమూలన ఉన్న గిరిజన, ఎస్‌సి, మత్స్యకార ప్రాంతాల్లో నిర్మించడం జరిగిందన్నారు. ఈ ఆలయాల్లో అనునిత్యం భజనలు నిర్వహించేందుకు అవసరమయ్యే భజన సామగ్రిని టిటిడి సమకూరుస్తుందని తెలిపారు.
అంతేగాక రాష్ట్రంలోని అన్ని వేంకటేశ్వరస్వామివారి ఆలయాల్లో ప్రతి శనివారం శ్రీ వేంకటేశ్వర పూజా విధానం నిర్వహించడం, భగవద్గీత పారాయణం చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. గ్రామాల్లోని దేవాలయాల్లో నిత్యం భజన కార్యక్రమాలు నిర్వహించే విషయమై స్థానిక ఆలయ నిర్వాహకులు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరముందన్నారు.