హైదరాబాద్ అక్టోబర్ 1
రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అసైన్డ్ భూములను ప్రభుత్వం లాక్కుంటుందన్న విపక్ష సభ్యుల వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ స్పందించారు. రాష్ట్రంలో ఎక్కడా అసైన్డ్ భూములను లాక్కోవడం లేదు. భూములను లాక్కోవడం మా ప్రభుత్వం పని కాదు. అభివృద్ధి కార్యక్రమాలకు అనివార్య పరిస్థితుల్లోనే అసైన్డ్ భూములను తీసుకుంటున్నాం. వారికి నష్ట పరిహారం ఇస్తున్నాం. అనవసరంగా తీసుకుంటే మీ దృష్టిలో ఉంటే చెప్పండి. కచ్చితంగా చర్యలు తీసుకుంటాం అని విపక్ష సభ్యులకు సీఎం సూచించారు. హరితహారంపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ చేపట్టిన సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వివరణ ఇచ్చారు. ఇరిగేషన్ ప్రాజెక్టులతో సహా ఇతర అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసేందుకు గవర్నమెంట్ ల్యాండ్‌ను ప్రభుత్వం తీసుకుంటుంది.టీఆర్ఎస్ ప్రభుత్వంలో వీలైనంత వరకు అసైన్డ్ భూములను లాక్కోవడం లేదు. వారి బతుకుదెరువు కోసం ప్రభుత్వమే ఇచ్చిన భూములు కాబట్టి, వారి ఉపాధి పోకుండా చూడాలి. అతి తక్కువ స్థాయిలో తప్పని పరిస్థితుల్లో వారి భూములు తీసుకుంటే.. ఇతరులకు ఏ విధమైన నష్ట పరిహారం ఇస్తున్నామో.. అదే విధంగా 100 శాతం నష్ట పరిహారం ఇస్తున్నాం. అసైన్డ్ భూములకు సంబంధించి వంద ఎకరాలు దళితులకు ఇచ్చాం అనుకుందాం. ఆ భూములకు నీరు పోవాలంటే ఆ భూముల గుండానే కాల్వ పోతుంది. అటువంటి పరిస్థితుల్లో కొంత భూమి తీసుకోవాల్సి వస్తుంది. పట్టా భూమి ఉన్న వాళ్లకు ఎంత నష్టపరిహారం ఇస్తామో.. వీరికి కూడా అంతే నష్టపరిహారం ఇస్తున్నాం అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.