లక్నోనవంబర్ 1
వచ్చే ఏడాది జరగబోయే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ చెప్పారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని చెప్పినట్లు స్పష్టమైంది. అయితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ లోక్‌దళ్ మధ్య పొత్తు ఉంటుందన్నారు. ఆర్ఎల్డీతో పొత్తు ఫైనల్ అయ్యిందని, కేవలం సీట్ల పంపకంపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆ ఇంటర్వ్యూలో అఖిలేశ్ వెల్లడించారు. ఆజమ్‌ఘర్ నుంచి ఎంపీగా ఉన్న అఖిలేశ్ యాదవ్ .. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. శివపాల్ యాదవ్‌కు చెందిన ప్రగతిశీల సమాజ్‌వాదీ పార్టీకి కూడా అవకాశం ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు.