న్యూ ఢిల్లీ అక్టోబర్ 11
దేశంలో తీవ్రమైన విద్యుత్ సంక్షోభం ముంచుకొస్తుందని ఇప్పుడు పెద్ద ఎత్తున ఆందోళన నెలకొంది. భారతదేశంలో బొగ్గు కొరత వల్ల డిమాండ్ కు తగ్గట్టుగా విద్యుత్ ఉత్పత్తి జరగడం లేదని సమాచారం. బొగ్గు నిల్వలు కొద్ది రోజులకు సరిపడా మాత్రమే ఉండడంతో ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్నాయి. బొగ్గు కొరత కారణంగా గుజరాత్ ముంద్రా లోని టాటా ప్లాంట్ లో విద్యుత్ ఉత్పత్తి నిలిచి పోయింది. ఈ ప్లాంట్ నుండి గుజరాత్ పంజాబ్ రాజస్థాన్ మహారాష్ట్ర హర్యానా రాష్ట్రాలకు విద్యుత్ సరఫరా అవుతోంది. ఈ ప్లాంట్ లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవటంతో జార్ఖండ్ బీహార్ రాజస్థాన్ రాష్ట్రాలలో ఇప్పటికే విద్యుత్ కోతలు కొనసాగుతున్నాయి.టాటా పవర్ శనివారం ఢిల్లీలోని వినియోగదారులను విద్యుత్తును జాగ్రత్తగా ఉపయోగించాలని కోరింది. క్షీణిస్తున్న స్టాక్ లను ఉదహరించింది. దేశ రాజధాని ఢిల్లీకి విద్యుత్ సరఫరా కాంట్రాక్ట్ నిర్వహిస్తున్న టాటా పవర్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ రొటేషనల్ పవర్ కట్స్ తప్పకపోవచ్చని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ధర్మల్ విద్యుత్ కేంద్రాలలో కరెంట్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు నిల్వలు 12 రోజులకు మాత్రమే సరిపడా ఉన్నాయని పేర్కొంది. ఈ క్రమంలో ఢిల్లీలో విద్యుత్ పరిస్థితి పై ఎలాంటి భయాందోళనలు లేవని చెప్పిన కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ విద్యుత్ వినియోగదారులకు ఎస్ ఎం ఎస్ లు పంపడం పై టాటా పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి హెచ్చరికలు జారీ చేశారు. దేశ రాజధానిలోని అధికారులు విద్యుత్ పంపిణీ సంస్థలు ఉత్పత్తి దారులు మరియు విద్యుత్ శాఖతో సమావేశం నిర్వహించిన ఆయన టాటా సంస్థ బాధ్యతారహితమైన ప్రవర్తనను కనబరిచిందని మండిపడ్డారు. గెయిల్ సంస్థ కూడా విద్యుత్ సంక్షోభం పై చేసిన అలర్ట్ ను మంత్రి తప్పుబట్టారు.ఈ చర్యపై టాటా పవర్ సీఈఓ కు నిరాధారమైన ఎస్ ఎం ఎస్ లను వినియోగదారులకు పంపించి వారిలో ఆందోళన సృష్టించవద్దని హెచ్చరికలు జారీ చేశామని మంత్రి చెప్పారు. దేశవ్యాప్తంగా విద్యుత్ కేంద్రాలకు అవసరమైన గ్యాస్ సరఫరాను కొనసాగించాలని తాము గెయిల్ సిఎండిని అడిగామని పేర్కొన్నారు. సరఫరా కొనసాగుతుందని ఆయన నాకు హామీ ఇచ్చారని స్పష్టం చేశారు. గెయిల్ ఒప్పందం గడువు ముగియబోతున్నందున 2 రోజుల తర్వాత గ్యాస్ సరఫరాను నిలిపివేస్తామని బవానా గ్యాస్ పవర్ ప్లాంట్ కు గెయిల్ సమాచారం పంపడంతో భయాందోళనలు నెలకొన్నాయని నేటి సమావేశంలో పాల్గొన్న గెయిల్ సిఎండిని అవసరమైన గ్యాస్ సరఫరాను కొనసాగించమని తాము అడిగామని వెల్లడించారు. విద్యుత్ మంత్రి ఆర్కే సింగ్ టాటా గెయిల్ విద్యుత్ సంస్థలు చేసిన ఎస్ఎంఎస్ ల వల్లే బాధ్యతారహితమైన ప్రవర్తన వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని కేంద్రం భావిస్తోంది. అందుకే ఈ రెండు సంస్థలకు హెచ్చరికలు జారీ చేశారు